
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా ప్రాథమికంగా 473 అనుమతుల్లేని నిర్మాణాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని భవనాలను కూల్చివేశారు. క్యూర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ముందుగా నోటీసులు జారీ చేసి, ఉల్లంఘనలకు సంబంధించిన కారణాలతో కూడిన ఉత్తర్వుల అనంతరం కూల్చివేతలు, సీలింగ్ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో తనిఖీలు కొనసాగించి, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలను వేగవంతం చేశారు. అనుమతులు లేకుండా, మంజూరైన భవన నిర్మాణ ప్రణాళికలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరవ్యాప్తంగా ప్రాథమికంగా 473 భవనాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఫీల్‌ఖానా, రెడ్‌హిల్స్, చిక్కడపల్లి ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన అంతస్తులు, ఇతర నిర్మాణాలను కూల్చివేశారు.
నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి, ఉల్లంఘనల తీవ్రతను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైన చోట్ల కూల్చివేతలు చేపట్టడంతో పాటు భవనాలను సీజ్ చేసే అవకాశముంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలిస్తున్న అధికారులు.. అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నవి, మంజూరైన ప్లాన్‌కు భిన్నంగా నిర్మిస్తున్నవాటిని గుర్తిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలను నిర్ధారించిన అనంతరం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసి చర్యలు తీసుకోనున్నారు. అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగరంలోని అన్ని జోన్లలోనూ తనిఖీలు కొనసాగించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని గోషామహల్ సర్కిల్ బేగంబజార్ ఫీల్ఖానాలో అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. అజీజ్ ప్లాజా సమీపంలో సుమారు 70 చదరపు గజాల స్థలంలో నిర్మించిన భవనంలో అనుమతులకు విరుద్ధంగా ఉన్న సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పై అంతస్తులను తొలగించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంజూరైన భవన నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణాలు జరిగాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. చిన్న స్థలాల్లో అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం వల్ల భవన భద్రత, రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రెడ్‌హిల్స్‌లో సుమారు 90 చదరపు గజాల స్థలంలో నిర్మించిన భవనంలోని మూడో, నాలుగో, ఐదో అంతస్తులను అధికారులు కూల్చివేశారు. మంజూరైన భవన నిర్మాణ ప్రణాళికకు విరుద్ధంగా నిర్మించిన భాగాలను తొలగించినట్లు సమాచారం. అలాగే, సికింద్రాబాద్ జోన్ పరిధిలోని చిక్కడపల్లిలో సుమారు 357 చదరపు గజాల స్థలంలో ఉన్న భవనంలోని అనుమతులు లేని నాలుగో అంతస్తును తొలగించారు. మూడు ప్రాంతాల్లో చేపట్టిన ఈ కూల్చివేతలు నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ నిఘా పెంచినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగించి, నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన భవనాలపై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)-2026 చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. తొలుత సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేసి, ఉల్లంఘనలకు సంబంధించిన కారణాలతో కూడిన ఉత్తర్వులు ఇవ్వనున్నారు. భవన నిర్మాణ అనుమతులు, మంజూరైన ప్రణాళికలు, నిబంధనల ఉల్లంఘనల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అవసరాన్ని బట్టి కూల్చివేతలు, సీజ్ చర్యలు చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఒక్కో భవనంపై తీసుకునే చర్యలు నిర్మాణ స్థితి, అనుమతులు, ఉల్లంఘనల స్వభావం, చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశారు.
నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో తనిఖీలు కొనసాగించనున్నారు. భవన యజమానులు, నిర్మాణదారులు మంజూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. అదనపు అంతస్తుల నిర్మాణం లేదా ఇతర మార్పులు చేయాలనుకుంటే ముందుగా సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను పాటించడం ద్వారా అక్రమ నిర్మాణాల వల్ల తలెత్తే సమస్యలను నివారించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
