
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వచన్ సదన్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా పలువురు విపక్ష నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీలో భాగంగా నేతలు తొలుత ఆకాశవాణి భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ సమీపంలోని మకర్ ద్వార్ మీదుగా ఈసీఐ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇండియా బ్లాక్ నేతలు నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలోనే నిరసనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల్లో ఓట్ల అక్రమాలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు నినదించారు. ఒక దశలో కొందరు ప్రతిపక్ష నేతలు బారికేడ్లు ఎక్కి ఈసీఐ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంట్, ఆకాశవాణి భవన్, విజయ్ చౌక్, నిర్వచన్ సదన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈసీఐ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
తమను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు.
ఎన్నికల సంఘం స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని, ఆయన రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
