తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. దీంతో తదుపరి టీటీడీ ఛైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది. కొత్త బోర్డు కూర్పుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న సమాచారంతో పాటు.. శ్రీనివాస రామానుజం, కళా వెంకటరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు.

ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీకాలంపై చర్చ సాగుతోంది. ఆయన చేపట్టిన సంస్కరణలు, ఎదుర్కొన్న విమర్శలు, వివాదాలు, ఆరోపణలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

తొలినాళ్ల నుంచే సంస్కరణలు

2024 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది.

వివిధ రాష్ట్రాల టూరిజం సంస్థలకు కేటాయిస్తున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రద్దు చేయడం, శ్రీవాణి ట్రస్టు పేరులో మార్పు, ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తరలించడం, తిరుమలలో రాజకీయ ప్రకటనలకు అడ్డుకట్ట వేయడం, స్థానికులకు ప్రత్యేక దర్శనం వంటి నిర్ణయాలు తీసుకుంది.

తర్వాత హోటల్ బుకింగ్స్‌లో ఈ-టెండర్లు, దర్శన సమయాన్ని తగ్గించేందుకు సాంకేతికత వినియోగం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు కూడా ముందుకు వచ్చాయి.

వివాదాలు.. విమర్శలు

అయితే బీఆర్ నాయుడు పదవీకాలం పూర్తిగా సంస్కరణలకే పరిమితం కాలేదు. టీటీడీ పరిపాలన, పలు నిర్ణయాలు, తిరుమలలో చేపట్టిన మార్పులపై వివిధ వర్గాల నుంచి విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఆయా అంశాలపై బీఆర్ నాయుడు, టీటీడీ యంత్రాంగం తమ వివరణలు ఇచ్చాయి.

మొత్తంగా చూస్తే.. బీఆర్ నాయుడు హయాంలో సాంకేతికత, పరిపాలనా మార్పులపై దృష్టి పెట్టడంతో పాటు పలు సవాళ్లు, వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త ఛైర్మన్ ఎంపిక సమయంలో ఆయన రెండేళ్ల పనితీరును ప్రభుత్వం ఏ విధంగా అంచనా వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

By Ramya