అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని జనసేన పార్టీ నేతలు, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. పవన్‌ కల్యాణ్‌ కొత్త ఛానల్ ప్రారంభిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారంటూ కొందరు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే, ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని కార్యాలయం వెల్లడించింది.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నిర్వహిస్తున్న ఈ నకిలీ ఛానల్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని జనసేన నేతలు ఆరోపించారు.

అధికారిక ఛానల్ కాదని స్పష్టీకరణ

‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో ఉన్న వాట్సాప్ ఛానల్‌కు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం, సంబంధం లేని అంశాలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *