
తాడేపల్లి, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం టీడీపీకి రాజీనామా చేసిన ఆమె.. మరుసటి రోజే వైఎస్సార్‌సీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీలో అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన
టీడీపీలో తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పనిచేసిందని గుండ లక్ష్మీదేవి తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు. ఆయన మరణానంతరం కూడా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు.
తన భర్త విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో పాటు, విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెలను ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాలను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని తెలిపారు. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనూ పార్టీ అధినేత పరామర్శకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్ నిరాకరణతో మొదలైన అసంతృప్తి
గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ పిలుపుతో 1985లో టీడీపీలో చేరారని లక్ష్మీదేవి గుర్తుచేశారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేయగా, తాను కూడా ఎమ్మెల్యేగా సేవలందించానని తెలిపారు. 2014లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, 2019లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యానని చెప్పారు. 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించినప్పటికీ పార్టీలోనే కొనసాగానని పేర్కొన్నారు.
ఇటీవల శ్రీకాకుళం మేయర్ పదవి తమకు దక్కుతుందని భావించినా, ఆ స్థానం జనసేన పార్టీకి కేటాయించడంతో రాజకీయ పరిణామాలు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన సోదరులు ఆమెతో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీలో నిబద్ధతతో పనిచేస్తా
వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని గుండ లక్ష్మీదేవి తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానని, ఇకపై కూడా అదే నిబద్ధతతో కొనసాగుతానని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు.
