
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తనను వెన్నుపోటుదారుడిగా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్‌దే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని గుర్తుచేశారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారని ఆరోపించారు.
ఈ అంశాన్ని సోనియాగాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారని తెలిపారు. జగన్ ఏ విధంగా రాజీనామా చేశారో తాను కూడా అదే విధంగా పార్టీని వీడానని అలాంటప్పుడు తనను వెన్నుపోటుదారుడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి 40 ఏళ్ల పాటు సేవ చేశానని జగన్‌తో కలిసి ఏడాది పాటు జైలులో ఉన్నానని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. తాను చేసిన సేవలు త్యాగాల కారణంగానే పార్టీలో పదవులు లభించాయని పేర్కొన్నారు.
ఇక పరివర్తన రాజనీతి పార్టీ లక్ష్యాలు భవిష్యత్ కార్యాచరణను విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు రాజకీయ కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని ప్రజలకు మరో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాను పరివర్తన రాజనీతి పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని స్పష్టం చేశారు. పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో 66 శాతం టికెట్లను యువతకు కేటాయిస్తామని ప్రకటించారు. జెన్‌జీ యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వచ్చే ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామం నుంచి గ్రామానికి పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏపీలో రిజర్వాయర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వృథాగా సముద్రంలో కలుస్తున్న 5 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
2019-2024 మధ్య ఏపీలో మత మార్పిడులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉందని అయితే ఒత్తిడి ద్వారా మత మార్పిడులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు.




