
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.
ప్రమాదం తీవ్రతకు ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. ప్రమాదం తీవ్రతను చూసిన స్థానికులు క్షణాల్లో పెద్ద విషాదం చోటుచేసుకునేదని అభిప్రాయపడ్డారు. ఘటన అనంతరం స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొనగా, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదం కారణంగా యావర్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

