
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. దేశ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అలవాటుగా మారిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ప్రస్తావిస్తూ.. రెండేళ్ల క్రితం కూడా ఉద్యోగాల భర్తీపై హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టినా, కనీసం శాసనసభలో చేసిన ప్రకటనలకు అయినా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించారు.
ఇటీవల ఖమ్మంలో వేణు అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను ప్రస్తావించిన కేటీఆర్.. అతడు రాసిన సూసైడ్ నోట్‌లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చేరే వరకు షేర్ చేయాలని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ లేఖలో తమ పేరును కూడా ప్రస్తావించినప్పటికీ, అది సాధారణ సూసైడ్ నోట్ కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యువకుడి ఆవేదనను ప్రతిబింబించే అభియోగ పత్రంలా ఉందని వ్యాఖ్యానించారు.
అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను గుర్తు చేసిన కేటీఆర్.. హామీలు అమలు చేయకపోతే ఇప్పుడు తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్లకుండా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రం రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

