
పాయకాపురం, అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచేందుకు లేబర్ అడ్డాను ఏర్పాటు చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ రోడ్లపై నిలబడే పరిస్థితి లేకుండా కార్మికులకు గుర్తింపు, గౌరవం కల్పించేలా స్థిరమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
మంగళవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్మికుల కోసం నిర్మిస్తున్న లేబర్ అడ్డా భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను తెలుసుకుని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో లేబర్ అడ్డాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడమే లేబర్ అడ్డా ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు కార్మికుల సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
