హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS) నిర్మాణం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయని రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌కు ‘సూర్య’గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కొత్త స్లిప్‌వే ప్రారంభం, ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి కీల్ లేయింగ్ కార్యక్రమాలు హెచ్ఎస్ఎల్ సామర్థ్యాన్ని చాటుతున్నాయని పేర్కొన్నారు. సమన్వయంతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా విశాఖపట్నాన్ని ప్రధాన నౌకాయాన, పారిశ్రామిక కేంద్రంగా మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.
హెచ్ఎస్ఎల్ విస్తరణతో ఎంఎస్ఎంఈలు, స్థానిక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ నౌకా నిర్మాణం, దేశీయ సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత నౌకాదళం, పారిశ్రామిక రంగాల సమన్వయంతో విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
కాగా విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ తరహా నౌకలు భారత నౌకాదళానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. సముద్రంలోనే యుద్ధనౌకలకు ఇంధనం, ఇతర అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.