
జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వారి సేవలను స్మరించుకుంటూ సందేశాలు పోస్ట్ చేశారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వక నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు.. సత్యం, అహింస, పరిశుభ్రత, గ్రామ స్వయం పరిపాలన వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలను ఏకం చేసి నడిపించిన తీరు చిరస్మరణీయమన్నారు.
గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, స్వయం సమృద్ధిగల, పేదరిక రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూడా చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత రెండో ప్రధానమంత్రిగా సేవలందించిన శాస్త్రి నిరాడంబరత దేశభక్తి, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాంధీజీ సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
సత్యం, అహింస, నిస్వార్థ సేవ పట్ల ఆయనకున్న విశ్వాసం తరతరాలకు స్ఫూర్తినిస్తోందన్నారు. గ్రామ స్వరాజ్యంపై గాంధీజీ దార్శనికతను ప్రస్తావిస్తూ గ్రామాలను బలోపేతం చేయడం సమాజాలను సాధికారత కల్పించడం స్వావలంబనను ప్రోత్సహించడం ద్వారా బలమైన సుసంపన్నమైన భారత్‌ను నిర్మించవచ్చని పేర్కొన్నారు. గాంధీజీ ఆదర్శాలను మాటల్లోనే కాకుండా చేతల్లో సమాజ సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
