
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 59 కింద 500 చదరపు గజాల లోపు విస్తీర్ణానికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. భూ రికార్డులు, లబ్ధిదారుల అర్హత, స్థల విస్తీర్ణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
గతంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కేసులతో పాటు, ఇప్పటికే కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిన వ్యవహారాలపైనా సమీక్ష చేపట్టనున్నారు. మరోవైపు, సెక్షన్ 22-ఎ పరిధిలోని రిజిస్ట్రేషన్ సమస్యలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులు, నాలా ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి కూడా రెవెన్యూ శాఖ చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ నిర్ణయాలతో పెండింగ్ భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంది.
జీవో 59 దరఖాస్తుల పరిష్కారానికి నెల రోజుల గడువు.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా జీవో 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మెమో నంబర్ 48030 జారీ చేసినట్లు తెలిపారు.
గతంలో జారీ చేసిన జీవోలు 14, 22, 29, 41 నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
జీవో 59 పరిధిలోని దరఖాస్తుల పరిశీలనలో భాగంగా భూ రికార్డులు, దరఖాస్తుదారుల అర్హత, క్రమబద్ధీకరణకు సంబంధించిన స్థల విస్తీర్ణాన్ని సమగ్రంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విధించిన నెల రోజుల గడువులోగా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
గతంలో జీవో 59 అమలులో కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిన కేసులను సైతం మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న దరఖాస్తులపై సంబంధిత కోర్టుల ఆదేశాలకు అనుగుణంగానే తుది నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
సెక్షన్ 22-ఎ కింద భూములు, ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ హామీ అమలులో భాగంగా ప్రభుత్వం వివిధ సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఈ అంశంపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటికే పలు కీలక ఉత్తర్వులు, మార్గదర్శకాలను జారీ చేశామని, సుమారు 10 నుంచి 12 రకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. జీవో 118, జీవో 76లకు సంబంధించి కూడా స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన మెమోలను జారీ చేసినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, గతంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు
