ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో స్పష్టత రావడంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే దిశగా ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు కొనసాగనున్నాయి.

ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు.

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మినహా మిగిలిన కమిటీల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

ఈ అడ్‌హాక్ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించనున్నాయి. కమిటీల పనితీరును డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. త్వరలోనే కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతి కమిటీలో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నాయకులతో పాటు, ఆ పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున నాయకులకు అవకాశం కల్పించారు. వీరికి సహకారం అందించేందుకు ప్రత్యేకంగా నిర్వాహక్ దళ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు కొనసాగనున్నాయి.

మరో నాలుగు కీలక కేంద్ర కమిటీలు

అడ్‌హాక్ కమిటీలతో పాటు ఎన్నికల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు జనసేన పార్టీ మరో నాలుగు కీలక కేంద్ర కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో ఎన్నికల నిర్వహణ కమిటీ, మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ (ఆర్థిక) కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

ఈ మున్సిపల్ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా దీర్ఘకాలికంగా బలపడాలంటే గ్రామాలు, వార్డుల స్థాయిలో పార్టీ ఉనికిని విస్తరించుకోవడం, కేడర్‌ను క్రియాశీలంగా ఉంచుకోవడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడానికి కీలక అవకాశంగా మారనున్నాయి.

మరోవైపు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ, ఉపాధి హామీ పథకం నిధుల వినియోగం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల్లో జనసేన తన సత్తా చాటడం కీలకంగా మారనుంది. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడం, మరోవైపు తన శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పవన్ కళ్యాణ్‌కు కీలక సవాలుగా నిలవనుంది. మొత్తంగా, ఈ ఎన్నికల ఫలితాలు జనసేన భవిష్యత్ రాజకీయ విస్తరణకు మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రతిష్టకు, పాలనా పనితీరుపై ప్రజల అభిప్రాయానికి కూడా ఒక పరీక్షగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *