
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన స్పందించారు.
ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సింగీతం శ్రీనివాసరావు మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని లోకేశ్ పేర్కొన్నారు. తన తాతయ్య ఎన్టీఆర్, బాలా మామయ్యతో కలిసి సింగీతం పనిచేశారని, ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారని గుర్తుచేశారు.
బాలకృష్ణ కెరీర్లో ఆణిముత్యాలుగా నిలిచిన ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు సింగీతం దర్శకత్వం వహించారని తెలిపారు. 95 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు అని కొనియాడారు.
సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.
