
స్థానిక ఎన్నికలపై వైసీపీ లీగల్ సెల్‌కు సజ్జల సూచనలు
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను బెదిరించే అవకాశం: సజ్జల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి నేతలు వైసీపీ అభ్యర్థులను బెదిరించే అవకాశం ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అధికారాన్ని ఉపయోగించుకుని పోలీసులు, అధికారుల ద్వారా అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో శనివారం నిర్వహించిన జూమ్ సమావేశంలో సజ్జల మాట్లాడారు. నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ పార్టీ అభ్యర్థులకు అవసరమైన న్యాయ సహకారం అందించాలని లీగల్ సెల్ ప్రతినిధులను కోరారు.
అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర కీలక పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై తక్షణమే స్పందించేలా న్యాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు.
ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సజ్జల సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులకు న్యాయపరమైన అండగా నిలవాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.
