
పోలవరం ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్ర శనివారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) నిర్మాణంలో ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రోడ్ రోలర్‌ను నడిపించి ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణ పనుల పటిష్టతను పరిశీలించారు. అనంతరం గ్యాప్-1, గ్యాప్-2, జీ-హిల్ ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
అంతకుముందు ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల వేగవంతానికి అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
