
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న లోకేశ్ అర్జీలను స్వయంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజాదర్బార్‌లో ప్రధానంగా ఉద్యోగ, విద్య, సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. సంక్షేమ, విద్యా సహాయకులకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బంజారా తండాల్లోని ఆలయాల పూజారులకు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం అందించాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు కోరారు. ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గౌరవ వేతనం పెంచాలని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వినతిపత్రాలను లోకేశ్‌కు అందజేశారు.
చిత్తూరు జిల్లా చీకటిపల్లెకు చెందిన గ్రామస్తులు తమ ప్రాంతంలో సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు శ్మశానవాటికకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అందిన అర్జీలపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
