
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద టిప్పర్ల ఘటనపై నెలకొన్న ప్రచారానికి తెరపడింది. టిప్పర్ల డ్రైవర్లు, టోల్ ప్లాజా సిబ్బంది తాజాగా ఈ ఘటనపై స్పష్టత ఇచ్చారు. ఈ వ్యవహారానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు.
ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కొన్ని టిప్పర్లు వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద ఆగిపోయాయి. వాహనాల ఫాస్ట్‌ట్యాగ్‌లలో తగిన బ్యాలెన్స్ లేకపోవడంతో టోల్ సిబ్బంది వాటిని నిలిపివేసినట్లు డ్రైవర్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగానే ఉన్నాయని చెప్పారు.
‘పోలీసుల భయంతో ఎమ్మెల్యే పేరు చెప్పాం’
ఘటన సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో భయపడి.. వాహనాలను విడిచిపెడతారనే ఉద్దేశంతో తాము చింతమనేని ప్రభాకర్ మనుషులమని చెప్పినట్లు డ్రైవర్లు వెల్లడించారు. అనంతరం ఫాస్ట్‌ట్యాగ్‌ను ఆన్లైన్లో రీచార్జ్ చేయడంతో సమస్య పరిష్కారమై టిప్పర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని తెలిపారు.
ఈ టిప్పర్లకు చింతమనేని ప్రభాకర్‌తో ఎలాంటి సంబంధం లేదని డ్రైవర్లు స్పష్టం చేశారు. వాహనాలు ఏలూరుకు చెందినవేనని చెబుతూ.. తమ వల్ల ఎమ్మెల్యే పేరు ప్రస్తావనకు వచ్చినందుకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
టోల్ సిబ్బంది కూడా అదే వివరణ
టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ లేకపోవడంతోనే టిప్పర్లు నిలిచిపోయాయని తెలిపారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు గతంలో కూడా కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటన కూడా అలాంటిదేనని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ.. తనకు ఎలాంటి సంబంధం లేని ఘటనలో తన పేరును ఉపయోగించడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తన పేరును ఉపయోగించి లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
