UCSFకు గుంటూరు దంపతుల భారీ విరాళం

UCSFకు గుంటూరు దంపతుల భారీ విరాళం.. రూ.10 కోట్లతో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!

గుంటూరు నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (UCSF)కు 1 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని ఇచ్చారు.

కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో జరిగిన కార్యక్రమంలో ఈ విరాళాన్ని యూనివర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. అంబటి దంపతుల సేవాభావాన్ని UCSF డీన్ డాక్టర్ జోస్ ఎం. భారల్ సాంచేజ్ ప్రశంసించారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిధి

శ్రీమన్నారాయణ దంపతులు ఇచ్చిన విరాళాన్ని ఎండోమెంట్ ఫండ్‌లో శాశ్వత నిధిగా ఉంచనున్నారు. ఈ మొత్తాన్ని పెట్టుబడిగా కొనసాగిస్తూ.. దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే విద్యార్థుల కోసం వినియోగించనున్నారు.

ముఖ్యంగా ప్రతిభావంతులైన వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు గ్రామీణ వైద్యం, కుటుంబ వైద్యం తదితర రంగాల్లో పరిశోధనలకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. తద్వారా భవిష్యత్ తరాల వైద్య విద్యార్థులకు కూడా ఈ విరాళం ప్రయోజనం చేకూరనుంది.

‘నాకు UCSF ఎంతో ఇచ్చింది’

తాను 1986 నుంచి UCSFలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు. దాదాపు 40 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న తమ కుటుంబానికి UCSF ఎంతో గుర్తింపునిచ్చిందని చెప్పారు.

తాను వైద్యుడిగా స్థిరపడేందుకు అవకాశం కల్పించిన సంస్థకు తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు. తన సతీమణి రమ ప్రోత్సాహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

ఈ నిధుల ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం అందడంతో పాటు.. భవిష్యత్‌లో ఎంతోమంది వైద్యులు, పరిశోధకులు తయారయ్యేందుకు అవకాశం ఉంటుందని శ్రీమన్నారాయణ దంపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

By Ramya