
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి ఆవేశం తనకు అర్థమవుతోందని.. అయితే ప్రస్తుతం రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన సమయం అని అన్నారు. రాజకీయాలు, గొడవలు, యుద్ధం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు తాను ఎలా స్పందిస్తానో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
అవతలి వారు హద్దులు దాటితేనే యుద్ధం చేయాల్సి వస్తుందని.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఇది శాంతి, అభివృద్ధి సమయమని.. గొడవలు, కొట్లాటలు, హింసకు దూరంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాయలసీమ అభివృద్ధిపైనే దృష్టి
కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. రూ.30 వేల కోట్లకు పైగా విలువైన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని అన్నారు.
పులివెందుల అయినా, వైసీపీ ఎంపీ ఉన్న అరకు అయినా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అందరికీ సమానంగా పనిచేస్తుందని చెప్పారు. రాయలసీమ పౌరుషానికి తగ్గట్లుగా ప్రస్తుతం రాజకీయ ప్రసంగం చేయడం లేదని.. అభివృద్ధికి అనుగుణంగానే మాట్లాడుతున్నానని అన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచినందుకే భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
అమరజీవి జలధార–జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రూ.30,106 కోట్లతో 50,315 పనులు చేపట్టి 24,601 ఆవాసాల్లో 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అదనంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు అందించి.. మొత్తం 3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకునేలా ఈ ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’ అనే పేరు పెట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
