ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన అనుమానితుల్లో ఒకడిగా భావిస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాది హషీమ్ ఫౌజీ అలియాస్ మూసా తాజాగా భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మంగళవారం రాత్రి కశ్మీర్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో అతడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆర్మీ జవాన్లు సంబరాలు చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిగా పేర్కొన్న లష్కరే తొయిబా టాప్ కమాండర్ అసిఫ్ ఫౌజీ అలియాస్ మూసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మూసా హతమైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఆపరేషన్ అనంతరం ఉగ్రవాదిని మట్టుబెట్టిన విజయాన్ని ఆర్మీ జవాన్లు సంబరంగా జరుపుకున్నారు. ఆనందంతో జవాన్లు డ్యాన్స్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జవాన్ల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఘటనా స్థలంలో మూసా మృతదేహంతో పాటు భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి గుర్తించిన ముగ్గురు అనుమానితుల్లో మూసా కూడా ఒకడిగా ఉన్నాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న అతడి ఆచూకీ కోసం భద్రతా బలగాలు రూ.20 లక్షల రివార్డును ప్రకటించాయి. 2023 సెప్టెంబరులో భారత్‌లోకి చొరబడిన అసిఫ్ ఫౌజీ.. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

పిర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా స్థావరాలు ఏర్పాటు చేసుకుని మూసా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తొలుత పూంచ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరించిన అతడు, అనంతరం సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్, యుస్మార్గ్ ప్రాంతాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లోనూ మూసా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో అతడి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో సెప్టెంబరు 5న బుద్గామ్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన ‘ఆపరేషన్ అషదార్’లో మూసాకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న యాసిర్ అలియాస్ అబు తల్హా హతమయ్యాడు.

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన ప్రాంతానికి చేరుకున్న భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ముష్కరులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించాయి.