నందిగామ: ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నందిగామ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నూతన పాలకవర్గానికి సూచించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి ఎంపీగా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పదవులు అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు లభించిన బాధ్యతలని పేర్కొన్నారు.

సోమవారం నందిగామలో జరిగిన మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం, అభినందన సభకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చైర్‌పర్సన్ శాఖమూరి వంశీధర్, వైస్ చైర్‌పర్సన్ తొర్లికొండ సీతారామయ్యతో పాటు కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాయకత్వం, కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో నందిగామలో చారిత్రాత్మక విజయం సాధించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించడం నూతన పాలకవర్గం ప్రధాన బాధ్యత అని చెప్పారు.

నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. రహదారులు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, స్థానికంగా కూటమి పాలకవర్గం ఉండటంతో ట్రిపుల్ ఇంజిన్ తరహా సమన్వయంతో నందిగామ అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. అమరావతి, విజయవాడకు సమీపంలో ఉన్న నందిగామకు అభివృద్ధి పరంగా ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు.

నూతన కౌన్సిలర్లు రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. కౌన్సిలర్లలో యువత అధికంగా ఉండటం సంతోషకరమని, యువత ఉత్సాహానికి సీనియర్ నాయకుల అనుభవం తోడైతే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు.

కూటమి ఐక్యతకు ప్రాధాన్యమిస్తూ బీజేపీకి వైస్ చైర్మన్ పదవిని కేటాయించామని తెలిపారు. భాగస్వామ్య పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు సాగుతామని, పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *