
విజయవాడలోని పున్నమిఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా తుఫాన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన అనంతరం తిరిగి ప్రారంభం కానుంది. ఈ నెల 28న మూసివేసిన మేళాను నేటి నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.
జాతీయ సరస్ మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సంప్రదాయ హస్తకళలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, ప్రాంతీయ ప్రత్యేక ఆహార పదార్థాలు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటం లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి మేళాను సందర్శించి మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశా కోరారు.
15న ప్రారంభమైన సరస్ మేళా
విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఈ నెల 15న జాతీయ సరస్ మేళా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేళాలో దాదాపు 650 స్టాళ్లను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులు హస్తకళలు, చేతివృత్తుల వస్తువులను ప్రదర్శిస్తున్నారు.
ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహించనున్న సరస్ మేళాకు తుఫాన్ కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడింది. తాజాగా మేళాను తిరిగి ప్రారంభించడంతో సందర్శకులు మరోసారి వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కలగనుంది.
