తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్–2026 కార్యక్రమాన్ని ఇద్దరు మంత్రులు కలిసి ప్రారంభించారు.

అనంతరం తెలంగాణకు సంబంధించిన రహదారులు, జాతీయ రహదారుల అభివృద్ధి, నిధులు, అనుమతులపై వారు చర్చించారు. ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ మధ్య ప్రతిపాదించిన 6 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్‌కు 2026–27 ఆర్థిక సంవత్సరంలో మంజూరు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులను కేటాయించాలని ఆయన కోరారు.

తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న చింతన్ శివిర్–2026 కార్యక్రమాన్ని నితిన్ గడ్కరీతో కలిసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కార్యక్రమం అనంతరం తెలంగాణకు సంబంధించిన వివిధ రహదారి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఇరువురు మంత్రులు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మంజూరీలు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణలో వేగంగా పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా రహదారి మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి వివరించారు. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు త్వరగా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 2026–27 వార్షిక ప్రణాళికలోనే ప్రాజెక్టుకు మంజూరు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత ప్రతిపాదనలో ఆర్‌ఈ వాల్‌ విధానానికి బదులుగా వయాడక్ట్‌ విధానాన్ని అనుసరించాలని మంత్రి సూచించారు. భవిష్యత్‌లో చేపట్టనున్న మెట్రో రెండో దశ విస్తరణకు అనుగుణంగా కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ తూర్పు ప్రాంతం నుంచి నగరంలోకి, నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు భవిష్యత్‌లో పెరగనున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సమగ్రంగా రూపొందించాలని మంత్రి వివరించారు. దీర్ఘకాలిక రవాణా అవసరాలకు అనుగుణంగా కారిడార్‌ నిర్మాణంలో ముందస్తు ప్రణాళిక, సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సుమారు రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో యాదగిరిగుట్ట, నల్గొండ హనుమాన్ హిల్, నాగార్జునసాగర్–నాగార్జునకొండ, మంథని రామగిరి కోట, నిజామాబాద్ కిల్లా రామాలయం ప్రాంతాల్లో రోప్‌వేలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే పర్యాటకులు, భక్తుల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆధునిక రవాణా సదుపాయాలతో అనుసంధానించడంలో రోప్‌వేలు కీలక పాత్ర పోషించనున్నాయి. తద్వారా తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.