హైదరాబాద్‌ నగర వాహనదారులకు తీపి కబురు. నగరంలో అత్యంత ట్రాఫిక్‌ రద్దీ ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 జీవీకే వన్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మార్గంలో ఐదు ర్యాంపులతో పాటు మాసబ్‌ట్యాంక్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులను తొలగించడానికి నాలుగు లేన్ల అండర్‌పాస్‌ను ప్రతిపాదించారు. కన్సల్టెన్సీ ద్వారా సర్వేలు ముగిశాక డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించి, రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) సరికొత్త వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. నగరంలోనే విపరీతమైన ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 మార్గంలో నాలుగు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బంజారాహిల్స్ జీవీకే వన్‌ మాల్‌ నుంచి ప్రారంభమై.. మాసబ్‌ట్యాంక్ మీదుగా మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానమయ్యేలా ఈ బృహత్తర ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు.

నగరవాసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సులువుగా, వేగంగా చేరుకునేందుకు గత వైఎస్సార్ హయాంలో 11 కిలోమీటర్ల మేర పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించినప్పటికీ ప్రస్తుతం పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులకు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను చేరుకోవటం కష్టంగా మారింది. రద్దీ వేళల్లో కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి వాహనదారులకు కనీసం గంట సమయం పడుతోంది. సాధారణ సమయాల్లో సైతం అరగంటకు పైగా ట్రాఫిక్‌లోనే నరకం చూడాల్సి వస్తోంది. తాజ్‌కృష్ణా హోటల్‌, కేర్‌ ఆస్పత్రి, పెన్షన్‌ ఆఫీసు, ఎన్‌ఎండీసీ ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన కదులుతుంటాయి. ముఖ్యంగా వర్షం పడితే ఈ రోడ్డు పూర్తిగా స్తంభించిపోతుంది. మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ కింది జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యలు తీరలేదు. ఈ ఇబ్బందులన్నింటికీ శాశ్వత పరిష్కారంగా ఈ మూడు కిలోమీటర్ల కారిడార్ ఉపయోగపడనుంది.