ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం పై జాతీయ మానవహక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.

తమిళనాడు తెలుగు యువశక్తి  వ్యవస్థాపక అధ్యక్షుడు కె. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి  బస్సు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సమగ్ర యాక్షన్‌ టేకన్‌ రిపోర్టు( ఏటీఆర్‌ )ను సమర్పించినా ఇంకా ప్రమాదానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదని జగదీశ్వర రెడ్డి తెలిపారు.

రీజాయిండర్‌కు స్పందించిన కమిషన్‌ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు అధికారిక నోటీసు జారీ చేసిందని అన్నారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, నాలుగు వారాల్లోపు ఏటీఆర్‌ను సమర్పించాలని, మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12, సెక్షన్ 13 ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశించిందని వెల్లడించారు.

ఇది కేవలం ప్రమాదం కాదు.  20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూడలేము.  ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కుకు సంబంధించిన అంశం.  ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాలి.  బాధ్యులెవరో బయటపడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

By Ramya