
ఏలూరు, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడేది లేదని ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఏలూరు రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన.. జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు.
ప్రయాణికుల వెయిటింగ్ రూమ్, పబ్లిక్ టాయిలెట్లు, మహిళల మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లను పరిశీలించిన ఎంపీ.. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం రైల్వే అధికారులతో సమావేశమైన మహేష్ యాదవ్.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రతిపాదించిన సుమారు 30 ఆర్వోబీల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. గత ఏడాదే అనుమతులు వచ్చినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించే తేదీలపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఎల్సీ-365తో పాటు మరో రెండు ఆర్వోబీల నిర్మాణ పనులను నవంబర్, డిసెంబర్లో ప్రారంభిస్తామని అధికారులు ఎంపీకి తెలిపారు. ఈ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.
ఇప్పటికే నిర్మించిన ఆర్వోబీల కింద పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఫిర్యాదులను కూడా ఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో బ్రిడ్జిల కింద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు కొత్త ఆర్వోబీల నిర్మాణంపై అధికారులతో సమీక్షించినట్లు అనంతరం మీడియాకు మహేష్ యాదవ్ తెలిపారు.
