మార్పులు ఎవరు చేశారో రికార్డులు పరిశీలిస్తాం: సీజేఐ సూర్య కాంత్‌

న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) వినియోగించే ‘ఫారం 6’లో చేసిన సవరణలకు తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ మార్పులు ఎవరి ద్వారా జరిగాయో నిర్ధారించేందుకు సంబంధిత రికార్డులను పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్‌ తెలిపారు.

సవరించిన ఫారం 6కు తాము అనుమతి ఇచ్చినట్లు చెప్పడం సరికాదని సీజేఐ స్పష్టం చేశారు. ‘‘రికార్డులను కోర్టుకు సమర్పించినప్పుడు ఫారం 6లో మార్పులు ఎవరు చేశారో పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈసీ నుంచి స్పందన వచ్చే వరకు ఆ సంస్థ నిర్ణయాలు చట్టబద్ధంగానే ఉన్నట్లు భావిస్తామని ధర్మాసనం పేర్కొంది.

‘‘ఒక నివేదిక ఆధారంగా మాత్రమే మేము ఉత్తర్వులు జారీ చేయలేం. ఈసీ స్పందన కోసం వేచి చూడాలి’’ అని సీజేఐ సూర్య కాంత్‌ వ్యాఖ్యానించారు.

ఫారం 6లో మార్పులపై వివాదం

‘ఓటర్ల నమోదు నియమావళి–1960’లో ఫారం 6 భాగంగా ఉంది. దీనిలో మార్పులు చేయాలంటే నిబంధనల ప్రకారం సవరణ అవసరం. అయితే 2025లో ఫారం 6కు అనుబంధంగా ఒక డిక్లరేషన్‌ను జత చేయాలని ఈసీ నిర్ణయించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మల గత ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివరాలను అందించాల్సి రావడం వివాదానికి దారితీసింది.

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ తమకు తెలియకుండా, తమ సిఫార్సులు లేకుండానే ఎస్‌ఐఆర్‌, ఫారం 6కు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారని ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి ఆరోపించినట్లు సెప్టెంబర్‌ 25న ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో వారు రికార్డుల్లో తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు ఆ కథనం పేర్కొంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 28న ఈసీ స్పందిస్తూ.. ఫారం 6 సవరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని, దానికి జతచేసిన డిక్లరేషన్‌ను కూడా కోర్టు సమర్థించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు తాజాగా తోసిపుచ్చుతూ, ఫారం 6లో చేసిన సవరణలకు తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని స్పష్టం చేసింది.

By Ramya