అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్న తెలుగు ఎన్నారై పులిపాటి భరత్ తన చివరి రోజులను సొంతూరిలో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నారు. తనను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని ఆస్పత్రి బెడ్‌పై నుంచి ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

నెల్లూరు ప్రాంతానికి చెందిన భరత్ గత నాలుగేళ్లుగా హెపటోసెల్యులార్ కార్సినోమా (HCC) అనే కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో సాధారణ విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదని, మెడికల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ఎయిర్ అంబులెన్స్ అవసరమని చెప్పారు.

భరత్ తన కుటుంబంతో కలిసి సొంతూరిలో మిగిలిన సమయాన్ని గడపాలన్నదే తన చివరి కోరిక అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

భరత్ విజ్ఞప్తిపై స్పందించిన నారా లోకేష్.. ఆయన సోదరి ప్రత్యూషతో మాట్లాడినట్లు తెలిపారు. వైద్యులు ప్రయాణం చేయొద్దని సూచించినట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో భరత్ కుటుంబానికి అండగా ఉంటామని, వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తామని చెప్పారు.

భరత్ చికిత్స, ఇతర అవసరాల కోసం కుటుంబం ఫండ్ రైజింగ్ కూడా చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 47 శాతం నిధులు సమకూరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు వీలైనంత సాయం చేయాలని కోరుతున్నారు.

By Ramya