
అవనిగడ్డ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తీవ్ర తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ముఖ్యంగా నాగాయలంక, కోడూరు మండలాల్లోని తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.
అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే పునరావాస శిబిరాలకు వెళ్లేందుకు సహకరించాలని కోరారు. పశుసంపదను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపడతారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
