వార్తా కథనాల ఆధారంగా విధులను అడ్డుకోలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషీల అనుమతి లేకుండానే 2025 అక్టోబర్‌ నుంచి 2026 ఆగస్టు మధ్య 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై పిటిషన్లు దాఖలయ్యాయి. మార్గదర్శకాల్లో మార్పులు చేయడంతోపాటు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు.

చీఫ్‌ జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వీ. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై స్పందించింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషి, ఈడీ డైరెక్టర్‌ జనరల్‌ సీమా ఖన్నా, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ మానేశ్‌ గార్గ్‌లను వివరణ కోరింది.

కేవలం వార్తా కథనాల ఆధారంగా సీఈసీ విధులను అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీ వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. సీఈసీ విధులను అడ్డుకోవాలన్న సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.

ఇదిలా ఉండగా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమంగా ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణలు కూడా పిటిషన్లలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఈసీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను కొనసాగించనుంది.

By Ramya