
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. గత పది నెలల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న 14 కీలక నిర్ణయాలను మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన కథనం కలకలం రేపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై న్యాయపరమైన సమీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై తక్షణ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మాత్రం ధర్మాసనం అంగీకరించింది.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలకు నోటీసులు జారీ చేసింది.
పట్నాకు చెందిన రాకేష్ కుమార్ సింగ్, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల సంఘం అధికారాలను ఏకపక్షంగా వినియోగించారా? అనే అంశాన్ని పిటిషనర్లు ప్రధానంగా లేవనెత్తారు. SIR ప్రక్రియకు సంబంధించి సీఈసీ తీసుకున్న నిర్ణయాలపై కూడా వారు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
‘‘సవరించిన ఫారమ్-6కు మేము ఎలాంటి ఆమోదం ఇవ్వలేదు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కోర్టు ముందు సంబంధిత రికార్డులు సమర్పించిన తర్వాత, అసలు మార్పులు ఎవరు చేశారన్న విషయాన్ని పరిశీలిస్తాం. అయితే, పిటిషనర్ల విజ్ఞప్తులు కొంత గందరగోళంగా ఉన్నాయి’’ అని సీజేఐ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
పిటిషనర్లు చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. సంబంధిత నిర్ణయాలు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నారా? లేదా? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా నిర్ణయాలు చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లు తేలితే, వాటిని రద్దు చేయడంతో పాటు చట్టపరంగా చెల్లుబాటు కానివిగా ప్రకటించే అధికారం తమకు ఉందని పేర్కొంది.
‘‘ఏదైనా నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోలేదని అధికారిక రికార్డులు స్పష్టం చేస్తే.. అలాంటి నిర్ణయాల అమలును నిలిపివేసి, అవి చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించగలం. అయితే, అన్ని నిర్ణయాలూ ఏకపక్షంగానే తీసుకున్నాయని ముందుగానే ఒక నిర్ధారణకు రావడం సాధ్యమేనా? ఈ అంశంపై ప్రతివాదులు స్పష్టమైన, పారదర్శకమైన వివరణ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడేందుకు తుది విచారణ పూర్తయ్యే వరకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని ఒక పిటిషనర్ కోరారు. ఈ వ్యవధిలో సంధూ, జోషి కలిసి ఎన్నికల సంఘం బాధ్యతలను నిర్వహించాలని, కమిషన్లో ఏదైనా ఖాళీ ఏర్పడితే భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సభ్యుడిగా ఉన్న కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరో పిటిషనర్ విధి నిర్వహణలో విఫలమైనందుకు సీఈసీతో పాటు ఇతర అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో జారీ చేసిన నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్వేర్ మార్పులన్నింటినీ ‘‘రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం, మొదటి నుంచే చెల్లుబాటు కానివి’’గా ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు.
కమిషనర్ల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు మెజారిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంటున్న ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం, 2023’లోని సెక్షన్ 18ను త్రిపాఠి తన పిటిషన్లో ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలను కమిషనర్లు సమష్టిగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వాదించారు.
