
రూ.5 లక్షల గోల్‌మాల్‌పై ఎస్పీకి ఫిర్యాదు
గుంటూరు వెస్ట్ క్రైమ్, టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం పోగేసిన అసోసియేషన్ నిధులతో పాటు ప్రభుత్వ బాడుగ బిల్లుల సొమ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు రూ.5 లక్షల మేర నిధులు గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ గుంటూరు టాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
2024లో ఆర్టీఓ అధికారుల సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు టాక్సీలను క్రమబద్ధంగా బాడుగకు నడిపేందుకు డ్రైవర్లు కలిసి అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. సభ్యత్వ, పార్కింగ్ రుసుములతో పాటు వాహనాలను బాడుగకు పంపినప్పుడు కొంత మొత్తాన్ని సంఘం నిధిగా జమ చేసేవారమన్నారు. ఈ నిధులను సభ్యుల ఆరోగ్య బీమా, అత్యవసర పరిస్థితులు, కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బాడుగలు, ఎన్నికల సమయంలో నడిపిన వాహనాలు, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపులు కూడా సంఘం ద్వారా జరిగేవని తెలిపారు. అయితే సంఘం అధ్యక్షుడు షేక్ ఖాసిం సైదా నిధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు ఆరోపించారు. బాడుగ బిల్లుల్లో అవకతవకలకు పాల్పడి, సంఘం ఖాతా నుంచి నగదు డ్రా చేసి దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు.
సంఘం నిధులు, బ్యాంకు లావాదేవీలు, బాడుగ బిల్లుల లెక్కలు చూపాలని కోరగా అధ్యక్షుడు స్పందించకుండా దుర్భాషలాడి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని సభ్యులు ఆరోపించారు. తమకు రావాల్సిన బాడుగ బిల్లుల సొమ్ము అందక కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధుల లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి, దుర్వినియోగమైన మొత్తాన్ని తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు జిల్లా ఎస్పీని కోరారు.
