ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఈ నెల 2న జరిగిన ఓ కార్యక్రమంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టు రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదం చోటుచేసుకుంది.
కార్యక్రమంలో కొందరు ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారని, ఆమె ప్రసంగిస్తున్న సమయంలో కొందరు మధ్యలో అడ్డుకున్నారని సులేమాన్ ఖాన్ అనే వ్యక్తి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టును జైరాం రమేశ్ రీపోస్ట్ చేస్తూ నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఘటనతో స్పష్టమవుతోందని, ఉద్యోగాల కోసం కోరిన వారిని సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సముదాయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
జైరాం రమేశ్ పోస్టుపై నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కొట్టిపారేశారు. కార్యక్రమానికి హాజరైన టీడీపీ, జనసేన కార్యకర్తలు వాస్తవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమం పూర్తయ్యాక వారిని కలవాలని చంద్రబాబు సూచించారని వివరించారు. అయితే ఈ వాస్తవాలను పట్టించుకోకుండా జైరాం రమేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆమె విమర్శించారు.
జైరాం రమేశ్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మదనపల్లె కార్యక్రమంలో జరిగిన విషయాలను ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంగా చిత్రీకరించడం సరికాదన్నారు. కార్యక్రమానికి ఊహించని స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడంతో అది సజావుగా కొనసాగేందుకు తాను జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
కాగా వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా జైరాం రమేశ్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మదనపల్లె కార్యక్రమానికి సంబంధించిన ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చోటుచేసుకున్న ఈ సోషల్ మీడియా వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.