
కర్నూలు రూరల్ బ్యూరో, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ సూచించారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ, పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.
‘సేవా సంకల్పం అభియాన్’లో భాగంగా ఆదోని మండలం మండగిరి, ఇంద్రనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ‘అంగన్వాడీ ఉత్సవం–పౌష్టికాహారం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆది కృష్ణమ్మ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను వివరించారు.
నెలనెలా పౌష్టికాహారం
అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా టేక్ హోమ్ రేషన్‌లో 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 450 గ్రాముల నూనె, 13 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం తల్లుల ఆరోగ్యంతోపాటు గర్భస్థ శిశువు ఎదుగుదలకు, చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు.
గర్భిణులు క్రమం తప్పకుండా ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకోవాలని, బాలింతలు ప్రసవానంతర ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్నారులకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించడంతోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.
కార్యక్రమంలో సీడీపీఓ లోకేశ్వరి, సూపర్‌వైజర్ భార్గవి, అంగన్వాడీ టీచర్ హైమవతి, మాజీ ఎంపీపీ మురళి, ఎన్డీయే కూటమి నాయకులు బాబురావు, బెస్త ఓంకార్, దేవేంద్ర, ఉపేంద్ర, అబ్దుల్, రేవన్, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
