వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో అంతిమంగా లబ్ధి పొందింది జగన్‌నేనని ఆధారాలు వెల్లడించాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుపై జగన్ మౌనం నేరాన్ని అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. కేసులో వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తే జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.
పేదల సొంతింటి కలను గత జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపల్లి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
‘అమరజీవి జలధార’ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ‘పల్లె పండుగ-3.0’లో భాగంగా రూ.11 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
రాయలసీమకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. హంద్రీ నీవాను అభివృద్ధి చేసి కుప్పానికి నీరు అందించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతూ ‘రాయలసీమ రైజింగ్’కు ప్రభుత్వం బాటలు వేస్తోందని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ నాయకులను బెదిరించి, దాడులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నవారే ఇప్పుడు పారదర్శకత గురించి మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఏకగ్రీవాలు తమ విధానం కాదని, పారదర్శక ఎన్నికలే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.