శ్రీకాకుళం: సాధారణంగా కంచె మొక్కగా కనిపించే మొగలి.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రైతులకు మంచి ఆదాయ వనరుగా మారింది. జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 6 వేల హెక్టార్లలో రైతులు మొగలిని సాగు చేస్తున్నారు. మొగలి పూలను విక్రయించడంతో పాటు వాటి నుంచి సువాసన నూనెను తయారు చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

మొగలి మొక్కను ఒక్క కొమ్మతోనే నాటుకోవచ్చు. ఏడాదిలోపే పిలకలు వేసి దట్టమైన కంచెలా మారుతుంది. పెద్దగా నీరు అవసరం లేకపోవడంతో పాటు తెగుళ్ల బెడద కూడా తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఒక్కో మొక్క నుంచి నాలుగు నెలల పాటు సుమారు వెయ్యి పూల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు. పువ్వులను సాధారణంగా కిలోకు కాకుండా ఒక్కొక్కటిగా రూ.14 నుంచి రూ.16 వరకు విక్రయిస్తారు. జూలై నుంచి అక్టోబర్‌ వరకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది.

లీటర్‌ నూనె రూ.4 లక్షల వరకు

శ్రీకాకుళం జిల్లాలో మొగలి పువ్వులతో అత్తరు, సువాసన నూనె తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ప్రత్యేక పద్ధతిలో పూలను వేడి చేసి ఆవిరి నుంచి నూనెను సేకరిస్తారు. సీజన్‌, డిమాండ్‌ను బట్టి ఈ నూనె లీటర్‌ రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ఒక లీటర్‌ నూనెను సేకరించేందుకు దాదాపు 20 వేల మొగలి పువ్వులు అవసరమవుతాయి. ఈ నూనెను కాస్మెటిక్స్‌, ఔషధాలు, అగరబత్తీల తయారీలో వినియోగిస్తున్నారు. చైనా, రష్యా, అమెరికాతో పాటు కాన్పూర్‌, భువనేశ్వర్‌, జైపూర్‌, కోల్‌కతా ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

కంచె నుంచి ఆదాయ వనరుగా..

సముద్ర తీర ప్రాంతాల్లో, కొబ్బరి, జీడిమామిడి తోటలకు కంచెగా, పొలం గట్లు, కాలువ గట్లపై పెంచే మొగలి ఇప్పుడు రైతులకు ఆదాయాన్ని అందిస్తోంది. కొబ్బరి తోటల్లో నష్టాలు ఎదుర్కొన్న కొందరు రైతులు వాటిని తొలగించి మొగలి సాగు చేపడుతున్నారు. ఈ సాగును వ్యవసాయ అనుబంధంగా గుర్తించి ప్రభుత్వం రాయితీలు అందించాలని రైతులు కోరుతున్నారు.

By Ramya