భారతీయ నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి చేరింది. దేశీయంగా నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (FSS-1) విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. ‘సూర్య’గా నామకరణం చేసిన ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో ప్రారంభించారు.
ఇదే కార్యక్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్-5కు కీలు వేశారు. ఆధునీకరించిన స్లిప్‌వే-4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్‌ను కూడా రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సముద్ర రంగంలో దేశ లక్ష్యాలను సాధించే స్థాయిలో విశాఖపట్నాన్ని కీలక మారిటైమ్ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
FSS-1 జలప్రవేశం విజయానికి ప్రతీకగా, FSS-5కు కీలు వేయడం భవిష్యత్ సామర్థ్యాలపై నమ్మకానికి సంకేతంగా అభివర్ణించారు. కొత్త స్లిప్‌వే దేశ నౌకా నిర్మాణ సామర్థ్యం పెరుగుతున్నదానికి నిదర్శనమన్నారు. సముద్రంలో సుదీర్ఘకాలం కార్యకలాపాలు నిర్వహించే యుద్ధ నౌకలకు ఇంధనం, లాజిస్టిక్స్, ఇతర నిర్వహణ సహకారం అందించే ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు కీలకమని రాజ్‌నాథ్ తెలిపారు.
హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం తన కార్యకలాపాలను మరింత సమర్థంగా కొనసాగించేందుకు FSS-1 దోహదపడుతుందని చెప్పారు. గత ఎనిమిది దశాబ్దాలుగా దేశ సముద్ర, రక్షణ అవసరాలకు HSL అందిస్తున్న సేవలను రక్షణ మంత్రి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ దేశ మారిటైమ్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పారిశ్రామిక వ్యవస్థతో HSL మరింతగా అనుసంధానం కావాలని సూచించారు. రాష్ట్రంలోని MSMEలు నౌకా నిర్మాణ రంగానికి సరఫరాదారులుగా ఎదగవచ్చని, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలో యూనివర్సిటీలు భాగస్వాములు కావాలని రాజ్‌నాథ్ సూచించారు. డిజిటల్ షిప్‌బిల్డింగ్‌కు టెక్నాలజీ కంపెనీలు, మారిటైమ్ టెక్నాలజీల అభివృద్ధికి స్టార్టప్‌లు సహకరించాలని అన్నారు.
HSL చుట్టూ సమగ్ర నౌకా నిర్మాణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు, HSL సీఎండీ రఘురామ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తదితరులు పాల్గొన్నారు.