కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ‘ఓటు చోరీ’ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికలను రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకు నమ్మకం పోయేలా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనా కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలపై నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు వింటే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్లే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గౌరవం పెరిగిందని అన్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. కేరళ, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎన్నికలపై ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు.
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్వోలు, ప్రభుత్వ అధికారులు భాగస్వాములుగా ఉంటారని, అలాంటప్పుడు అవకతవకలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. 1950 నుంచి ‘సర్’ ప్రక్రియ కొనసాగుతోందని, ఇది నిరంతర ప్రక్రియ అని సత్యకుమార్ వివరించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారని, 92.47 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.