హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాల నివారణకు హెచ్‌ఎండీఏ కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.7 కోట్ల వ్యయంతో ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ (ఐటీఎస్‌)ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి మరో వారం నుంచి పది రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు.

మొత్తం 11.63 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 19 పీటీజెడ్‌ కెమెరాలు, 10 ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు వాహనాల వేగాన్ని ప్రదర్శించే వీఎస్‌డీ, ట్రాఫిక్‌ హెచ్చరికలను జారీ చేసే వీఎండీ బోర్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీ హైదరాబాద్‌ సాంకేతిక సహకారంతో రూపొందిస్తున్న ఈ వ్యవస్థను ఇప్పటికే ఉన్న కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించనున్నారు.

ఈ ఆధునిక ట్రాఫిక్‌ వ్యవస్థ ద్వారా అతివేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం, ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే స్పందించడం సాధ్యమవుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడిస్తున్నారు. తద్వారా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

హైదరాబాద్‌ నగరాన్ని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాల నివారణకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో ఆధునిక ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ (ఐటీఎస్‌)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చాలాకాలంగా ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మరో వారం నుంచి పది రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు.

సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక కెమెరాలు, వాహనాల వేగాన్ని ప్రదర్శించే బోర్డులు, ట్రాఫిక్‌ హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు అతివేగాన్ని నియంత్రించి, ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వరకు 11.63 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లతో నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు అతివేగంగా ప్రయాణించడం, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇటీవల ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొనడంతో, వెనుక వచ్చిన మరో ఆరు కార్లు వరుసగా ఢీకొన్న ఘటన ఈ మార్గంలో భద్రతపై ఆందోళన కలిగించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై నెలకు పది కంటే ఎక్కువ చిన్నా, పెద్దా ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు, ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ, పోలీసుల నిఘా కొరవడటంతో కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌వేపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇందులో భాగంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకునేలా ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ (ఐటీఎస్‌)ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఐటీ హైదరాబాద్‌ సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తోంది. మొత్తం 29 ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేయనుండగా, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న 19 కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చనున్నారు. వీటిలో 19 పాన్‌ టిల్ట్‌ జూమ్‌ (పీటీజెడ్‌) కెమెరాలు, 10 ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు ఉంటాయి. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించనున్నారు.

పీటీజెడ్‌ కెమెరాల ద్వారా కంట్రోల్‌ రూమ్‌ నుంచే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. మార్గంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ట్రాఫిక్‌ స్తంభించినా వెంటనే గుర్తించి సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. మరోవైపు, ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వాహనాల నంబరు ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. దీంతో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం చలానాలు జారీ చేయవచ్చు.

వాహనదారులు అప్రమత్తంగా ఉండేలా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. వెహికల్‌ స్పీడ్‌ డిస్‌ప్లే (వీఎస్‌డీ) బోర్డులు వాహనాల వేగాన్ని ప్రదర్శిస్తూ, పరిమితికి మించి ప్రయాణించే వారిని హెచ్చరిస్తాయి. వేరియబుల్‌ మెసేజ్‌ డిస్‌ప్లే (వీఎండీ) బోర్డుల ద్వారా ప్రమాదాలు, ట్రాఫిక్‌ రద్దీ, అత్యవసర పరిస్థితులు, రహదారి భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఈ మొత్తం వ్యవస్థను పిల్లర్‌ నంబరు 164 వద్ద ఉన్న ప్రస్తుత కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించనున్నారు.

ఐటీఎస్‌ అందుబాటులోకి వస్తే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘా పెరగడంతోపాటు, ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను నియంత్రించడం, ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు అందించడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచవచ్చని అధికారులు భావిస్తున్నారు. నగరం నుంచి విమానాశ్రయానికి వెళ్లే కీలక మార్గంలో ఈ ఆధునిక సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *