కుప్పం: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ఫలితాలపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్‌కు సంబంధించి నమోదైన గణాంకాల్లో 31,471 ఓట్ల వ్యత్యాసం ఉన్నట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది.

ఈసీ రికార్డుల్లో అసమానత

ఎన్నికల సంఘం వద్ద ఉన్న రిటర్నింగ్ అధికారుల అంతర్గత నివేదికలను పరిశీలించిన ఈ సంస్థ ఈ వివరాలను బయటపెట్టింది. 2024లో ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఓట్లు వేసే విధానం అమలులో ఉంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

లోక్‌సభకు 56 వేలు.. అసెంబ్లీకి 24 వేలే!

చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న 56,067 మందికి స్లిప్పులు జారీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, అదే పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 24,596 మందికే స్లిప్పులు ఇచ్చినట్లు నమోదైంది. దీంతో రెండు లెక్కల మధ్య 31,471 ఓట్ల తేడా కనిపించింది.

ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఉంది. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

విచారణపై ప్రశ్నలు

ఒకే పోలింగ్ కేంద్రాల్లో రెండు ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అసమానతలపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన కథనంలో పేర్కొంది. ఈ వ్యవహారం ఎన్నికల గణాంకాల పారదర్శకతపై చర్చకు దారితీసింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *