
ఏపీలో నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఒక కల.. ఎన్నో ఏళ్లుగా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేశారు. కొత్త రైల్వే స్టేషన్‌లు కూడా సిద్దం చేశారు.. మరి రైలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్యాసింజర్ రైలు నడుపుతారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు అప్డేట్ రాలేదు. ప్రస్తుతానికి గుంటూరు నుంచి కనిగిరి వరకు రైలు నడిపితే తమకు ఉపయోగంగా ఉంటుందని కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల్ని వేగవంతం చేస్తోంది. కేంద్రంతో మాట్లాడి ఒక్కొక్కటిగా లైన్ క్లియర్ చేస్తోంది. హైదరాబాద్ టు తిరుపతి, చెన్నైను కనెక్ట్ చేసేలా నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పనులు దాదాపు ముగింపు దశకు వస్తుండగా.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌లో నడికుడి నుంచి కనిగిరి వరకు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మెయిన్ ట్రాక్ పనులు పూర్తి చేయగా.. లూప్‌లైన్ మూడు ట్రాక్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
నడికుడి టు శ్రీకాళహస్తి మొత్తం 309 కిలోమీటర్లు కాగా.. కొత్త రైల్వేలైన్‌లో ఐదు దశల్లో పనులు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో చేపట్టిన మూడు, నాలుగు దశల పనులు దాదాపుగా పూర్తి చేశారు. 145 కిలోమీటర్లు ట్రాక్ నిర్మాణం గార్లపేట వరకు దాదాపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ పనులతో పాటుగా దర్శి, పొదిలి, కనిగిరి స్టేషన్ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం గౌతువారిపల్లి, గార్లపేట రైల్వేస్టేషన్‌లలో పనులు చివరి దశలో ఉన్నాయి. కనిగిరి వరకు రైల్వే లైన్ పనులు పూర్తికాగా.. కనిగిరి వరకు రైలు నడిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రైల్వే లైన్‌లో స్టేషన్ల పనులు పూర్తికాగా.. సాంకేతికపరమైన పనులు, మిగిలినవి సమకూర్చాల్సి ఉంది.
వాస్తవానికి 2026 ఫిబ్రవరి నెలకు దర్శి, కనిగిరి వరకు రైలును నడపాలని ప్రజా ప్రతినిధులు రైల్వేశాఖను కోరారు. రైల్వే లైన్ పనులు పూర్తి కావడంతో స్థానికులు రైళ్లు నడపాలని కోరుతున్నారు. రెండు నెలల క్రితం గుంటూరు నుంచి కనిగిరి వరకు రైలు నడపబోతున్నట్లు ప్రచారం జరిగింది.. ఓ షెడ్యూల్ కూడా వైరల్ అయ్యింది. కానీ కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లకు కోడ్ నంబర్లు ఇవ్వక పోవటం.. అంతేకాదు దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి అనుమతులు రాకపోవడం కారణంగానే రైళ్లు నడపలేకపోతున్నారని చెబుతున్నారు.

