ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో శనివారం రాత్రి ఆరుగురు ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినులను ఎలుకలు నిద్రలో ఉండగా కరిచాయి. గాయపడిన విద్యార్థినులను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అత్యవసర విభాగంలో వారికి యాంటీ రేబీస్‌ (ARV), టిటానస్‌ (TT) ఇంజెక్షన్లు ఇచ్చారు.

హాస్టల్‌ కేర్‌టేకర్‌ సమాచారం ప్రకారం, హాస్టల్‌ ప్రాంగణం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు మరియు పర్యావరణ పరిశుభ్రత లోపం కారణంగా ఎలుకల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (DME) డాక్టర్‌ రఘునందన్‌కు ఆదేశాలు జారీ చేసి, హాస్టల్‌ వార్డెన్‌ మరియు ప్రైవేట్‌ పెస్ట్‌ కంట్రోల్‌ ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని సూచించారు.

దీని తరువాత DME ప్రైవేట్‌ ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా, హాస్టల్‌ వార్డెన్‌ నుంచి వివరణ కోరాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు.

By Rajini