ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

తమిళనాడు, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు ద్రోణి ఏర్పడగా.. కర్ణాటక పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం కూడా దీనిలో కలిసింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు

ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనకాపల్లి, పోలవరం, కాకినాడ, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడ్డాయి. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, రోలుగుంట, బుచ్చయ్యపేట మండలాల్లో వర్షం కురిసింది. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగిలో మోస్తరు వర్షం పడగా.. కాకినాడ జిల్లా తునిలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమ, మంగళవారాల్లో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉండటంతో.. ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది.

By Ramya