యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై సివిల్ సర్వెంట్లు, UPSC ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రసంగం ప్రారంభంలోనే ఇటీవల విమానంలో చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావించిన ప్రధాని దానిని సమయస్ఫూర్తితో, ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్‌ను అభినందించారు. బుధవారం జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ అసాధారణ ఓర్పు, అప్రమత్తత, ధైర్యాన్ని ప్రదర్శించారని మోదీ పేర్కొన్నారు. మరో 9/11 తరహా విషాదాన్ని నివారించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు.

1926 అక్టోబర్ 1న ఏర్పాటైన UPSC దేశ పరిపాలనా వ్యవస్థలో కీలకమైన సంస్థగా కొనసాగుతోంది. శతాబ్ది వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ UPSC శతాబ్ది స్మారక నాణెం, ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేశారు. అలాగే UPSC, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధాన రూపకల్పనకు సంబంధించిన కీలక తీర్పులతో కూడిన ‘100 Landmark Judgements – Shaping the Policies of UPSC and Public Service Commissions in India’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

దేశ సమగ్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై సివిల్ సర్వెంట్లు మరింత దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొంటూ ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

By Rajini