
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన దంపతులు ఒక్కసారిగా పరారవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.
స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధిక రాబడులు వస్తాయని నమ్మించి కాలనీలోని మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్టైల్స్’ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తూనే, మరోవైపు చిట్టీల వ్యాపారాన్ని కూడా కొనసాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల విశ్వాసాన్ని సంపాదించిన అనంతరం భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుల వివరాల ప్రకారం.. దంపతులు తమకు చెందిన ఇంటిని విక్రయించిన అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఫిర్యాదు స్వీకరించిన అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

