
రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మొబైల్ రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అయితే, ఛార్జీల అమలును ప్రస్తుతానికి నిలిపివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలకు నోటీసులు జారీ చేసింది.
రూ.2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై MDR: స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై విధిస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే, ఈ ఛార్జీల విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
దేశంలో విస్తృతంగా వినియోగిస్తున్న యూపీఐ చెల్లింపుల వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఛార్జీల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
సీనియర్ న్యాయవాది అంజన్ దత్తా దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధింపుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం వివరణ కోరింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్, ఈ ఛార్జీలు ప్రభుత్వం విధించే పన్ను లేదా ఫీజు కాదని కోర్టుకు తెలిపారు. ఇవి చెల్లింపుల వ్యవస్థలో భాగంగా వసూలయ్యే ఛార్జీలని వివరించారు.
యూపీఐ లావాదేవీల్లో పాల్గొనే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర సంబంధిత సంస్థల మధ్య ఈ మొత్తాలు పంపిణీ అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ అంశంపై తమ సమాధానాలు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, RBI, NPCIలకు సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినంత మాత్రాన రూ. 2,000కు మించిన ప్రతి UPI చెల్లింపుపై వినియోగదారుల నుంచి ఫీజు వసూలు చేయరు. ఈ MDR (Merchant Discount Rate) కేవలం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. అలాంటి లావాదేవీలపై MDR 0.4 శాతంగా ఉంటుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్టంగా రూ. 300 వరకు మాత్రమే ఛార్జీ విధించేలా పరిమితి నిర్ణయించారు.
ఉదాహరణకు, రూ. 10,000 విలువైన చెల్లింపు MDR పరిధిలోకి వస్తే, 0.4 శాతం చొప్పున రూ. 40 MDRగా వర్తిస్తుంది.
అయితే, ఈ రుసుము వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థకు సంబంధించినది మాత్రమే. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి ప్రత్యేకంగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, కొత్త నిబంధనలను కారణంగా చూపుతూ UPI యాప్‌లు వినియోగదారులపై అదనపు ప్లాట్‌ఫారమ్ ఫీజులు లేదా రహస్య ఛార్జీలు విధించడానికి అనుమతి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
