తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
కృష్ణా జలాల వాటాపై చర్చించే అవకాశం
చంద్రబాబు, విజయ్ భేటీలో ప్రధానంగా కృష్ణా జలాల పంపిణీ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు గంగ ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన నీటి వాటా పూర్తిస్థాయిలో అందడం లేదని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి అందాల్సిన నీటి వాటాపై విజయ్ చంద్రబాబుతో చర్చించే అవకాశముంది.
డ్యామ్‌ల నిర్మాణంపైనా చర్చ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల వినియోగం, నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశముంది.
ఇదిలా ఉండగా, విజయ్ తన విజయవాడ పర్యటనలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు, చర్చించనున్న అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.