తూర్పుగోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. పులిని పట్టుకునేందుకు హనుమాన్ బృందాలను రంగంలోకి దించాలని, అటవీ శాఖ జోనల్ కన్జర్వేటర్ పర్యవేక్షణలో ఆపరేషన్ కొనసాగించాలని ఆదేశించారు.
ప్రజలు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పులిని చూసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఉపముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతాల్లో పులి సంచారం
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలోని చిక్కాలపాలెం, అమ్మిగుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి జాడను గుర్తించి, దానిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టారు.
చిక్కాలపాలెం ప్రాంతంలో పులిని గుర్తించిన కొందరు స్థానికులు దానిని వెంబడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు పులికి దగ్గరగా వెళ్లకుండా, దాని కదలికలకు ఆటంకం కలిగించకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పులిని బంధించేందుకు విస్తృత ఏర్పాట్లు
గత ఐదు రోజులుగా పులి వేటాడలేదని, ఆహారం అందక నీరసించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు నిపుణుల సహకారంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పులి సంచారం నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని సూచించారు. పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు, ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నారు.