
తమిళనాడు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమ స్థిర, చరాస్తులతో పాటు అప్పుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఉద్యోగులు IFHRMS ఆన్లైన్ పోర్టల్‌ను వినియోగించాలని స్పష్టం చేసింది.
నిర్దేశించిన గడువులోగా ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించని ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆస్తుల వివరాల సమర్పణలో జాప్యం లేదా నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
అంతేకాకుండా, ఉద్యోగులు సమర్పించే ఆస్తులు, అప్పుల వివరాలను వారి వార్షిక గోప్య నివేదిక (ACR)లో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణీత గడువులోగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను IFHRMS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగుల పారదర్శకతను పెంచడం, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఇకపై తమ వార్షిక ఆస్తులు, అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా డిజిటల్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్ అధికారిక సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి–1973లోని రూల్ 7(3)కి చేసిన సవరణల ఆధారంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల ఆస్తులు, అప్పుల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా ఆర్థిక పారదర్శకతను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాలపై మెరుగైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నూతన నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ (AIS) అధికారులను మినహాయించి, మిగిలిన సచివాలయ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా న్యాయమూర్తులు, ప్రభుత్వ శాఖల అధిపతులు, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తమ ఆస్తులు, అప్పుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.
ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (IFHRMS) వెబ్ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. ఆస్తులు, రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు పోర్టల్‌లో మొత్తం మూడు ప్రత్యేక ఫారమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫామ్-1: ఉద్యోగికి చెందిన స్థిరాస్తుల వివరాలను ఇందులో నమోదు చేయాలి. భూములు, భవనాలు, ఫ్లాట్లు, సొంత ఇళ్లు తదితర ఆస్తుల సమాచారాన్ని ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది.
ఫామ్-2: చరాస్తులకు సంబంధించిన వివరాలను ఈ ఫారమ్‌లో నమోదు చేయాలి. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు తదితర ఆస్తుల సమాచారాన్ని ఇందులో పేర్కొనవచ్చు.
ఫామ్-3: ఉద్యోగికి ఉన్న రుణాలు, అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతల వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలి.
ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు, అప్పుల వివరాలను ఒకే డిజిటల్ వేదికపై నమోదు చేయడంతో పాటు, ఆర్థిక పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
